oఓo
ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః
ఉపనిషత్సార సంగ్రహ దర్శిని
(స్వరూపం నుండి పరిపూర్ణానికి దారి చూపే గురుకృప)

దివ్యాత్మ స్వరూపులార ! నాకు ముందొక ప్రశ్నకు సమాధానం కావాలి. బహుశ నన్ను ఇక్కడ పరిచయం ఉన్నవాళ్ళకందరకి తెలిసే వుంటుంది. అందరిలాగా నాకేదో మాట్లాడక పోవటం రాదని. మనందరం మనుషులం కాబట్టి సంభాషణ పూర్వకంగా మాట్లాడుకోవడమే సరియైన విధానం. అంటే ఒకరు మాత్రమే మాట్లాడి మరొకరు సగం విని సగం మరచిపోయే పద్ధతి సరియైనది కాదన్నమాట వేదాంతపద్ధతి. మీరు మేము సమస్థితిలో, మనమందరం ఒకే స్థితిలో ఉండి మాట్లాడాలి. ఉపనిషత్ ధర్మం కూడా అదే చెప్తుంది. అంటే గురువుగారు ఏ స్థితిలో ఉండి చెప్తారో ఆ బోధా కాలంలో శిష్యుడుగారు కూడా అదే స్థితిలో ఉండి వినాలి. వింటేనే అది వేదాంతపద్ధతి అవుతుంది. కాసేపాగితే lunch వస్తుందా రాదా?అని అలోచించేటువంటి పద్ధతిలో ఉన్న శిష్యుడు వేదాంత ధర్మానికి పనికిరాడన్నమాట. అర్థమైందా అండి. అందుకే మనం అందరం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా ఎవరు? దివ్యాత్మ స్వరూపులు. ఇది మీరందరు ఒప్పుకుంటారా? ఒప్పుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వేదాంతధర్మానికి పనికిరారన్నమాట. ఒప్పుకుంటారా అండి? అదే నా మొదటి ప్రశ్న. ఏమిటి? మనమందరం ఎవరు? దివ్యాత్మ స్వరూపులం. అంటే మనలో ఇప్పుడు రెండు లక్షణాలు ఉన్నాయని మనమే ఒప్పుకుంటున్నాము. దివ్యత్వము ఉంది. ఆత్మజ్ఞానము ఉంది. రెండున్నాయి, ఈ రెండూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళడానికి వీలౌతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఏమి వినేశారు? నాకు తెలిసి వేదాంత భాగంలో ఉన్నటువంటి శాస్త్ర పరిచయం కాని, సచ్ఛాస్త్ర శ్రవణం. ఇప్పటివరకు మీరు చేసినది. అంటే సత్సంగం అంటే రెండు రకాలు. ఒకటి ఏమిటి అంటే, సచ్ఛాస్త్ర విచారణ లేదా సచ్ఛాస్త్ర శ్రవణం. సత్ ని గురించి బోధించేటటు వంటి శాస్త్రాన్ని ఆశ్రయించి అది ఎలా సత్ ను గురించి మీకు వివరంగా తెలియ చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయటం సత్సంగం. రెండవ పద్ధతి ఏమిటంటే, ఆ సత్ యొక్క అనుభవం ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో సత్పురుషులు, వారిని ఆశ్రయించి, ఆ సద్విద్యని గ్రహించటం. అంటే సచ్ఛాస్త్ర శ్రవణం మొదటిస్థాయి అయితే, సద్విద్యను గ్రహించటం ఉత్తమమైన పద్ధతి. అది సత్పురుష సహవాసంలో మాత్రమే సాధ్యం. ఏమిటి ఈ రెండిటికి తేడా అంటే? సచ్ఛాస్త్ర శ్రవణంలో మీ పరిశ్రమ కూడా ఉంటుంది. మీరు ఆ బోధించే వారితోపాటు కలిసి శ్రమించాలి. అది బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. బాగా ఆకళింపు చేసుకోవాలి. ఆకళింపు చేసుకున్న దానిని ఆయన సమక్షంలోనే మరళ ప్రయోగించి ఆ ఫలితం మీరు రాబట్టగలగాలి. బోధించేవారి సమక్షములోనే చెయ్యాలి ఆపని. కాదు మీరెప్పుడో ఇంటికెళ్ళి చేస్తాం అన్నారనుకోండి ఇందులో సగమే గుర్తుంటుంది మనకి. అంతే కదండీ. కాబట్టి సత్సంగం అంటే ఎప్పుడైనా మీ అందరూ రోజువారీ మీ ఇంటి దగ్గర చెయ్యండి లేదా సామూహికంగా చేయండి ఒక్కరుగా చేయండి ఏదైనా చేయండి. కానీ అక్కడ ఏమి జరగాలి? ఒక శాస్త్రాన్ని మీరు దగ్గర పెట్టుకున్నారు, అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన దాన్ని వెంటనే ఏమి చెయ్యాలి? నిజజీవితంలోకి మొట్టమొదట దాన్ని మనం అనువదించాలి. నా జీవితానికి దీన్ని నేను ఎలా apply చేస్తాను? అని ఎవరికి వాళ్ళు మొట్టమొదట ఆ పరిశ్రమ చెయ్యాలి. చేసిన తరువాత ఏమి చెయ్యాలి? సరే, నా జీవితానికి ఇలా చేయాలి అలా చేయాలి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి. లోపల ఏవో ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలు వచ్చినంత మాత్రాన సరిపోతుందా? ఏమి చెయ్యాలి మరి? ఆచరణ అప్పుడే ఎక్కడ చేస్తారు? ఇంటికెళ్ళి కదా చేసేది, గురువుగారి ముందే ఆచరణ చేయటానికి వీలౌతుందా? వీలుకాదుగా కాని ఏమి చేయవచ్చు? నిర్ణయం తీసుకోవచ్చు. అర్థమైందా అండి? ఇందాకటినుంచి వారు చెప్పేది అదే! మీరు ఏమి చెయ్యాలి? గురువుగారి సమక్షంలో... నిర్ణయం తీసుకోవాలి. ఏవండి మీరిలా ఈ శాస్త్ర విషయం ఇలా బోధించారు. ఈ జ్ఞాన విషయాన్ని ఇలా బోధించారు. నాకిది ఇలా అర్థం అయ్యింది. ఈ అర్థమైన దాన్ని నా జీవితంలో నా స్వభావాన్ని పరిష్కరించటానికి నేను ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇకపై ఈ నిర్ణయం పైనే నిలబడి నేను జీవిస్తాను. అని ఎక్కడ నిర్ణయం తీసుకోవాలి? ఆ .. ఎవరైతే బోధిస్తున్నారో వారి ఆశ్రయంలో ఉండగానే, వారి సమక్షంలోనే. ఒక నిర్ణయం తీసేసుకోవాలి. అప్పుడు నిర్ణయం తీసుకోలేక పోయారనుకోండి ఏమౌతుంది? ఇంటికెళ్ళిన తరువాత కొద్దిగా మా సంసారం మా కుటుంబము వాళ్ళతో విచారణ చేసి అప్పుడు ఆలోచించి తీసుకుంటే బాగుంటుందా? తీసుకోకపోతే బాగుంటుందా? ఇంకా ఈయన మళ్ళా రావలసిందే. అర్థమైందా అండి. ఇహ ఈయనకు నిర్ణయం సాధ్యంకాదన్నమాట! కాబట్టి సత్ అనే అంశం గురించి మనం ఏదన్నా మాట్లాడాలన్నా చెప్పాలన్నా విచారణ చెయ్యాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా ఎలా తీసుకోవాలి ఇప్పుడు? తత్ క్షణమే! తత్ క్షణమే!! అంతే. దానికి పట్టవలసిన సమయం ఎంతండి? తత్ క్షణం. అంతే తత్ క్షణం అంటే ఎంతండి? చెప్పగలరా ఎవరైనా? తత్ క్షణం (రెప్పపాటు). రెప్పలు మూసుకుంటే ఎంత సమయం పడుతుందో అంత సమయంలో. ఎందుకని ఇలా అన్నారు? ఈ ఉదాహరణే ఎందుకు చెప్పారు చెప్పండి? ‘చూపునంటి మనసు నిలచుర సుజ్ఞానికి’ సూత్రం ఏమిటండి? ‘చూపునంటి మనసు నిలచుర సుజ్ఞానికి’ అంటే జ్ఞానంలో స్థాయీభేదం ఉందన్నమాట! ఇప్పుడు ఇందాక వాళ్ళంతా చెప్పారు. వ్యవహారజ్ఞానమని తరువాత ఆ జ్ఞానమనీ ఈ జ్ఞానమనీ! పరావిద్య అపరావిద్య రకరకాలు. అంటే మనం దానిని analyze చేసేకొద్దీ రకరకాల భాష్యాలు వస్తాయి. కాని ‘తత్’ అన్నదానికి అర్థం ‘అదే’ కదా! ‘తత్’ అనేదానికి యథాతథంగా దాని అర్థం చెప్పమంటే ‘అదే’ అని అనవలసి వస్తుంది. అంతకుమించి వేరే ఏమీలేదు. ‘అది’ అంటే? చూడండి. అంటే ‘త్వం’ని నిర్ణయిస్తే తప్ప ‘తత్’ని నిర్ణయించటానికి వీలుకావటం లేదు. అంతే కదండీ! ‘త్వం’ని నీవు నిర్ణయిస్తే తప్ప ఫలానా స్థానంలోనో ఫలానా స్థితిలోనో ‘త్వం’ని పెడితే ఈ ‘త్వం’ ఏది పొందాలో ఏది అవ్వాలో ఏది తెలుసుకోవాలో అంతే కదా! సత్సంగం ద్వారా మనం ఏమి చేస్తున్నాం? ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటున్నాం. ఏది పొందాలో అది పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఏది అవ్వాలో అది అవుతున్నాం. అర్థమైందా అండి. అంతేగా, సత్సంగ ప్రయోజనాలు ఈ మూడే. కాబట్టి ‘తత్’ అంటే ఏమిటయ్యా అంటే ‘అదే’ అంటారు అంతే. దానికేమి అవ్యయీ భావం. ఈ భావన ఆ భావన ఇక్కడ అక్కడ పెట్టటానికి ఏమీ వీలులేదు దానిని. ‘త్వం’ని ఎక్కడ పెడతాం? అన్నదాన్ని బట్టి ‘తత్’ యొక్క అర్థాన్ని నిర్వచించవలసి వచ్చింది. అంటే ఇప్పుడు మీ అందరకీ కూడా మహావాక్యాలను ఉపదేశం చేసేయ్యాలని ఇక్కడున్నటువంటి మహానుభావులు అనుకున్నారనుకోండి. ఎలా ఒకే సారి చెప్పెయ్యటానికి వీలైపోతుందా? ఎందుకని? ఒక్కొక్కరిని పిలవాలి ఇప్పుడు, నాయన నీ దృష్టిలో నువ్వు ఎవరు? మొదట నిన్ను అడగాలి. నువ్వెవరు? నీగురించి నువ్వేమనుకుంటున్నావో first నువ్వు చెప్పాలన్నమాట. నాగురించి నేను ఇది అనుకుంటున్నానండి అనిచెప్తే దానికి ఆ మూడు ప్రయోజనాలని అందించటానికి ప్రయత్నం చేస్తారు. ఇది బోధ అంటే. గురువుగారు బోధిస్తారు అంటే అర్థం ఏమిటంటే – ముందు నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. నీ గురించి నువ్వు ఏమి చెప్పుకున్నావ్? అనేదాన్ని బట్టి నీవు పొందవలసిన ప్రయోజనాన్ని వాళ్ళు నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాత్మకమైన శక్తి నీకు కలిగేటట్లుగా వాళ్ళు బోధిస్తారు. అర్థమైందా అండి! కాబట్టి ఇందులో ఎవరి పాత్ర ఎక్కువుంది ఇప్పుడు? నీ గురించి నీవు చెప్పుకోవటం ఎక్కువుందన్నమాట. అర్థమైందా అండి. కాని సాధారణంగా సత్సంగాలన్నిటిలో ఏమి జరుగుతుందండి? ఏమి జరుగుతుంది? మీ గురించి మీరేమీ చెప్పుకోరు. మేం మాత్రం మీమీద క్రుమ్మరించెయ్యటానికి ప్రయత్నం చేసేస్తూ ఉంటాం. ఈ క్రుమ్మరించటం వల్ల ఏమి ప్రయోజనం లేకపోలేదు ఉంటుంది. కాని సూటైన ప్రయోజనం ఉండదన్నమాట. సరాసరి ప్రయోజనం రాదన్నమాట! ఇందాక వారన్నారు చూడండి Equation. straight గా ‘సోయం దేవదత్తః’ – ‘నువ్వే ఆ దేవ దత్తుడివి’. నువ్వే దేవదేవుడవయ్యా! దేవుడవు కూడా కాదు, దేవదేవుడవు నువ్వే పో! అయిపొయింది ఒకమాటతో. కానీ నీకు కుదిరిందా? అది పెద్దసమస్య. నీకు కుదరటమే ముఖ్యం. నీకు కుదరలేదు అనుకోండి. బ్రహ్మంత ఆయుష్షుతో చదివినా సరే, అదింకా మిగిలే ఉంటుంది. నీ ఆయుష్షు కాదు బ్రహ్మంత ఆయుష్షుతో చదివినా సరే అదింకా మిగిలే ఉంటుంది. కాబట్టి నీకు నిర్ణయం కలగటమే అత్యంత ప్రధానం. బాగా గుర్తు పెట్టుకోండి. జ్ఞానం అంటే ఏమిటయ్యా? శాస్త్ర శ్రవణం వల్ల జ్ఞానం వస్తుంది. విచారణ – పదిమంది మనకు తెలిసిన వాళ్ళతో కలసి విచారణ చేయడం వలన కూడా జ్ఞానం వస్తుంది. కాని నీ స్వానుభవం ఒకటి ఉంటుందా ఉండదా? అది నువ్వు. అవునా కాదా? ఇప్పుడు. దాన్ని బట్టే అంచనా వేయటానికి వీలౌతుంది. మొదటి రెండు బౌద్ధిక ప్రక్రియలు. అంటే బుద్ధితో చేసేవి. నీ తెలివితేటలు ఎంత ఉంటే అంత విశ్లేషణ చేయవచ్చు. నీ సమర్ధత ఎంత ఉంటే అంత పరిశ్రమను బట్టి వాటిని విచారణ చేయవచ్చు అధ్యయనం చేయవచ్చు. కాని ఇందాక వారు అన్నారు. ఏమన్నారండీ! ఏమన్నా చేస్తే వచ్చేది జ్ఞానం కాదు. అంటే ‘కర్మ’వల్లగాని ‘ఉపాసన’వల్లగాని లభించే పరమప్రయోజనం, ‘పరమ-ప్రయోజనం’ ఎందుకంటే ‘ప్రయోజనము’వరకే మాట్లాడుకుంటే అది చాలదన్నమాట. కర్మ ఉపాసన యొక్క పరమప్రయోజనం ‘జ్ఞానం’ అనవచ్చునేమో గాని, కర్మ ఉపాసన యొక్క ‘ప్రయోజనం’ జ్ఞానం అని చెప్పటానికి వీలులేదు. ‘పరమ’ శబ్దం వేసినప్పుడల్లా ఏమౌతోంది? అది ‘జ్ఞాననిరూపణ’గా మారుతుంది. ‘పరమ’ అన్న శబ్దం లేదా ‘పర’ అన్న శబ్దం వేయలేదనుకోండి అది జ్ఞానానికి పనికిరావట్లేదు. ఎలా? దానికి ప్రమాణం ఏమిటి?

తత్వాతీత పరాత్మాహం మధ్యాతీత పరశ్శివః మాయాతీత పరంజ్యోతిః అహామేవాహ మవ్యయః” ‘బ్రహ్మజ్ఞానావళీ మాల’లో ఆదిశంకరులు అందించినటువంటి సూత్రం. ఏమయ్యా ఈ ‘పర’ అన్న శబ్దం మూడుచోట్ల మూడుస్థితులలో ఉంది. నువ్వు గనుక గురువుగారి బోధవల్ల తత్వదర్శనం, ‘తత్వదర్శనం’ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే ‘త్వం’ను గురించి తెలుసుకోవాలి, నువ్వు పొందవలసిన లక్ష్యమును గురించి కూడా తెలుసుకోవాలి, తెలుసుకుని ఏమి చెయ్యాలి? దర్శించాలి. ‘తత్వదర్శనం’ జరగాలి. తత్వదర్శనం జరిగితే ఏమి జరిగింది? ‘తత్వాతీత పరాత్మాహం’. అంటే దాని అతీతం సూచించబడాలి మళ్ళా నీకు, దర్శించినంత మాత్రాన అక్కడకు అయిపోలా నీపని. దర్శనానికి అతీతంగా ఉన్నటువంటి స్థితి నీకు సూచించబడినప్పుడు అతీతంలో నువ్వు లేవు. వచ్చిన తగాదా అది. దర్శిస్తున్నప్పుడు కూడా నువ్వు వున్నావు. అతీతంలో నువ్వు లేవు. నువ్వు లేని స్థితి నీకు ఎప్పుడైతే బోధపడిందో, స్వానుభవం అయ్యిందో, సూచ్యమైందో, నువ్వు కింకరుడుగా లేకుండా పొయ్యావో, అంటే అధిష్టాన ఆశ్రయపద్ధతిగా బోధ జరుగుతుంది ఎప్పుడూ కూడా! నువ్వే అధిష్టానం, నువ్వే బ్రహ్మ, నువ్వే ఆత్మ, నువ్వే చైతన్యం, నువ్వు తప్ప ఎవ్వడూ లేడు, నువ్వే సర్వ వ్యాపకము, నువ్వే అనంతం నువ్వే.... ఇవన్నీ అధిష్టాన పద్ధతి. కాని ఈ అధిష్టానానికి ఒక ఆశ్రయం ఉండాలా వద్దా? నువ్వు తండ్రి ఎప్పుడయ్యావ్? నీకు పిల్లలుంటే నువ్వు తల్లి తండ్రి అయ్యావ్. అంతేనా కాదా? పిల్లలు లేకుండానే నేను తల్లి తండ్రి అయ్యనండీ అన్నావనుకోండి? ఏమైంది అప్పుడు? ఇది సాధ్యమా? సాధ్యం కాదుగా! అంటే ఆశ్రయించేటటువంటి శిష్యుడు లేకపోతే గురువుగారు ఉంటారా? ఏవండి? ఆశ్రయించే శిష్యులు లేకపోతే గురువుగారు ఉంటారా? ఉంటారా ఉండరా? ఉండరా... అయితే మనం ఎవ్వరము వేదాంతబోధకు పనికిరాము. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకని? గురువు వేరే మొదటే చెప్పా నేను, గురువు వేరే శిష్యుడు వేరే – ఇదేగా మొదటి ద్వంద్వం? నేను వింటానికి వచ్చానండి, మీరు చెప్పటానికి వచ్చారండి. అర్థమైందా అండి? గురువు యెల్లకాలమూ ఉన్నాడు. అందుకే యెల్లకాలము ఉన్నవాడినే గురువుగా పెట్టుకున్నాము. సదా శివ సమారంభాం, కాసేపు ఇక్కడ మైకు ముందు చెప్పే ఆయన కాదు గురువు, కాసేపు వినేవాళ్ళు అంతకంటే కాదు. అర్థమైందా అండి? కాబట్టి “యెల్లకాలము ఉన్నవాడు యెవడో వాడిని అధ్యయనం చేయటానికి, ఏ మార్పూలేని స్థితి ఏదైతే ఉందో దానిని తెలుసుకోవటానికి అది అవ్వటానికి చేసే ప్రయత్నం పేరే సత్సంగం’’. కాబట్టి తత్వాతీత పరాత్మాహం అన్న ఒక అంశములోనే ‘తత్వదర్శనం’ పొందాలి. దర్శనానికి అతీతమైన స్థితిలో నువ్వు లేదనే శూన్యం అంటున్నారు చూశారా? అక్కడ నువ్వు లేవు. నువ్వులేవు కానీ ‘లేని నువ్వు’ ఎలా ఉన్నావో నీకు తెలియబడుతుంది. అంటే అప్పటి వరకు ఉన్న ‘త్వం’గా నువ్వు గాని అప్పటి వరకు నువ్వు పొందదలచుకున్న లక్ష్యశుద్ధి అయినటువంటి ‘తత్’గా గాని ఈ రెండు రూపాలుగా లేవు. ఈ రెండు దర్శనాలుగా లేవు. నీవెప్పుడైతే లేకుండా ఉన్న శూన్యాన్ని సూచించబడి నువ్వు తెలుసుకోగలుగుతున్నావో అక్కడ ఏమయ్యావ్? ‘పరాత్మ’. ‘మధ్యాతీత పరశ్శివః’ మరి ‘మధ్య’ అంటే? దేనికి మధ్య? ‘మధ్య’ అన్న శబ్దాన్ని దేనికోసం వాడుతున్నారయ్యా అంటే? మనమందరం సృష్టి క్రమశః విచారణ బాగా చదివేసుకుంటాం కదా! మొదటిపాఠములోనే. “బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్మహత్ మహతో మహదహంకారః మహదహంకారో ఆకాశః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః” ఈ పాఠం మీ అందరికి బాగా వచ్చేస్తుంది. వరసక్రమం వల్లెవేస్తారు ఇదంతా! ముందు బ్రహ్మంగారు ఉన్నారండి, చివరకి మనం ఉన్నామండి. అంతే దాని విషయం. మామూలుగా మాట్లాడితే అదే. దేనికి మధ్య అంటే ‘బ్రహ్మణోరవ్యక్తః’ అంటున్నామే, ఆ రెండింటికి మధ్య. నీ విచారణ ఇప్పుడు ఎక్కడ నిలబడాలటండీ? బ్రహ్మమునకు అవ్యక్తమునకు మధ్య గనుక నువ్వు నిలబడగలిగితే, దేనివల్ల ‘తత్త్వదర్శనం’ వల్ల, తత్త్వదర్శన సామర్థ్యము చేత, నువ్వు గనుక బ్రహ్మమునకు అవ్యక్తమునకు మధ్యగనుక నిలబడ గలిగితే, నీ స్వానుభవ ప్రమాణంతో, ఆ అతీతమమైనటువంటి సమర్ధత నీకు ఏర్పడినప్పుడు ఏమైందట, ఆ రెండిటి మధ్య అందుకే ‘మధ్య’ అన్న శబ్దం వాడారండి. వారు ఇటు అటు ఎక్కడా సూచించల. ఎందుకనిట? అది అనుభవ ప్రమాణం. ఆ ‘మధ్య’ అన్న శబ్దాన్ని ఎక్కడ ఉపయోగించాలి? అన్నది నీకు వెంటనే స్ఫురించాలన్నమాట! ఆ స్ఫురణ ఎప్పుడొస్తుంది? తత్వాతీత పరాత్మాహం అన్నటువంటిది ఎవరికైతే సూచనగా తెలుస్తుందో, వాళ్ళకి మధ్యాతీత పరశ్శివః. అనంగానే ఆహా! బ్రహ్మము అవ్యక్తము మధ్య గనుక నేను నిలబడిన వాడిని అయితే, ఇప్పుడు నేనెవరిని? మధ్య‘అతీతః’ అన్నాడు మళ్ళా! అనంగానే ఏమైంది ఇప్పుడు? ‘అవ్యక్తం’ లేకుండా పోయింది. ఒక భాగం లేకుండా పోయింది, ఉన్నది బ్రహ్మమే! సర్వకాలం ఉన్నది బ్రహ్మమే! అన్నప్పుడు ఏమైందట? పరశ్శివః. అంటే అవ్యక్తం దగ్గర నుంచి మన వరకు ఉన్నదంతా శివమే అయితే, బ్రహ్మమేమైయున్నది ఇప్పుడు? పరమైయున్నది. అవ్యక్తం నుంచి మన వరకు ఉన్నదంతా శివమే అయితే దాని అవతలిది ఏమైంది? పరమేమైంది? బ్రహ్మమైంది. ఇది బ్రహ్మమంటే! మధ్యాతీత పరశ్శివః. మరి మూడవది ఎందుకు చెప్పవలసి వచ్చిందండీ? “మాయాతీత పరంజ్యోతిః” ఏమండీ ఆ బ్రహ్మం గురించి చెప్పాలంటే ప్రకాశం గురించి చెప్పకుండా బ్రహ్మాన్ని నిర్వచించాలంటే వీలుకావటం లేదు. కింద నుంచీ మొదలుపెడితే, అర్థమైందా అండి? అసలు నిర్వచనం కోసం అందేదేనా బ్రహ్మమంటే? అని మళ్ళా అడిగితే? అది నిర్వచనానికి అందదండీ అంటున్నాము. అంటే దర్శనానికి అందనిది నిర్వచనానికి అసలు అందదు.  ఎందుకని? దర్శనం అవాంగ్మానసగోచరం. ఎలా? అంటే ఇందాక వారొక స్వప్నదృష్టాంతం చెప్పారు. ఇప్పుడు ఆ స్వప్నదృష్టాంతంలో మనమందరం ఉన్నామా లేదా? ఎవరి స్వప్నంలో వాళ్ళు ఉంటున్నామా లేదా? ఉన్నామా లేదా? అది వాక్కు మనస్సులు ఉన్నాయా అక్కడ? వ్యక్తంగా లేవుగాని అవ్యక్తంగా ఉన్నాయి. అంతేనాకాదా! దాని అవతల ఏముంది? నీ గాఢనిద్రావస్థ ఉంది. నీ గాఢనిద్రావస్థలో నువ్వున్నావా లేదా? లేకుండా నిద్రానుభవం ఎవరికి? నిద్రానుభవం నీకుందిగా! నువ్వు వ్యక్తీకరించావో లేదో? అక్కడ ఎవ్వరూ లేరు. రెండోవాడుంటే వ్యక్తీకరణతో పని. రెండువదుంటే వ్యక్తీకరణతో పని. నీ గాఢనిద్రావస్థలో నువ్వొక్కడివిగానే ఉన్నప్పటికీ నిద్రావస్థను అనుభవిస్తున్నావా లేదా? అనుభవిస్తున్నావ్ గా! అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఏకాకిగానే ఉన్నా కూడా అనుభవం ఉందికదా! అంటే నువ్వున్నావ్ అనుభవమూ ఉంది, అనుభవించబడేది కూడా ఉంది. అది ఆనందమయ కోశం అని ఇందాకే చెప్పాం. కోశానందం. మరి ఇప్పుడు త్రిపుటి ఉందా లేదా? గాఢనిద్రావస్థలో కూడా! ఉంది. మరి నేనున్నాన్న తెలివిమాత్రమే ఉండి, ఆనందమయ కోశనిరసన చేయబడిందే అనుకోండి? అంటే విషయ సుఖంగా మాత్రమే నిద్రావస్థని గమనించి శబ్ద స్పర్శ రూప రస గంధాలలో సంయోగం చెందకుండా విషయ సుఖాసక్తత చెందకుండా గనక నువ్వు సాక్షిత్వాన్ని ఆశ్రయించి నిలబడి మూడవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి తురీయావస్థని గనుక నువ్వు నిలబెట్టుకున్నవాడివైతే స్వానుభవంలో, అప్పుడేమయ్యావ్? నిద్రావస్థ కూడా ఒక విషయసుఖమే అనే సామాన్యమైనటువంటి దృష్టి నీకేర్పడుతుంది. ఆ సామాన్యదృష్టి వల్ల నీకు దర్శనశక్తి లభించింది. ఇది దర్శనశక్తి లభించేటటువంటి మార్గం. ఈ దర్శనం ఎవరికైతే కలిగిందో ఈ తురీయానుభవం ఎవరికైతే కలిగిందో వాళ్ళనే ఆత్మసాక్షాత్కారజ్ఞానం కలిగిన వాళ్ళని కూడా మనం చెప్తున్నాం. ఈ నిద్రకు సాక్షిత్వం అనే అనుభవం గనుక అతని దగ్గర అనుభవ ప్రమాణంలో లేదనుకోండి, మిగిలిన దంతా బౌద్ధిక ప్రమాణమే అవుతుంది తప్ప స్వానుభవ ప్రమాణానికి చాలదన్నమాట. తురీయానుభవం ఉన్నవాడికిమాత్రమే ‘అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా ...’ వాడు అధికారి, ఇందాక వారన్నారు ‘అధికారి’ అని. అధికారి ఎవరిప్పుడు ? ఎవడికైతే తురీయానుభవం ఉందో వాడు అధికారి. దేన్ని తెలుసుకోవటానికి? పరంజ్యోతి. మనమిప్పుడు ఏ విషయం మాట్లాడుతున్నాం? ‘మాయాతీత పరంజ్యోతి’. అంటే, ఏవండి! బ్రహ్మము కూడా చెప్పేసిన తరువాత ‘మాయ’విషయం ఎందుకు చెప్పారండి? ఏ ముందే ‘తత్త్వదర్శనం’ దగ్గరే చెప్పవచ్చు కదా! అంటే నీవు శివ దర్శనం పొంది, అంటే తురీయానుభవంలో ‘నేనే శివుడను’ అని ఇందాక వారన్నారు. ‘సచ్చిదానందం శివోహం’. అంటున్నావా లేదా? నిర్వాణషట్కంలో. శివోహం అన్నప్పుడు ఎక్కడిదాకా వచ్చావు నువ్వు? అవ్యక్తం కంటే కిందకే ఉన్నావ్. శివ స్వరూపమే తెలుసు నీకు అంతే. బ్రహ్మానుభవం లేదు. నాలుగు మహావాక్యాల ద్వారా సూచ్యమైన బ్రహ్మమును 1008 మహావాక్యాలలో గనుక నువ్వు విశ్లేషించి చూసుకోగలిగితే, అంటే ఏరితే 1008 మహావాక్యాలున్నాయి. వారన్నట్లుగా కొన్ని వేలవాక్యాలు ఉన్నప్పటికీ, మహానుభావులు 1008 ఏరారు. అంటే నీకు నీకు ఒక అనుక్రమణిక ఒక ప్రణాళికను ఏర్పాటు చెయ్యటం కోసమని కేవలం ఉపనిషత్తులను మాత్రమే అధ్యయనం చేసి సాధనంగా ముందుకు నడిచేటటువంటి సాధకుల కోసమని 1008 మహావాక్యాలని ఏరారు. ఈ 1008 మహావాక్యాలలో ఏ ఒక వాక్యాన్ని కనుక అతను దర్శించినా కూడా ‘తాను బ్రహ్మమే అయిఉన్నాడు’ అనేటటువంటి స్థితిని ఎప్పుడైతే స్వానుభవ ప్రమాణంలో కలిగి వున్నాడో, ఎలా నిర్ణయం? అంటే అవ్యక్తం నుంచి నీ వరకు నీ వరకంటే నామరూపాత్మకం వరకూ కూడా ఉన్నది శివమే ఆపైది పరం’’ అనే నిర్ణయాన్ని సర్వకాల సర్వావస్థలలోను కలిగియుండాలి. ఆస్థితిలో ఉండి ఏ జీవులకైనా సహాయం చేయగలిగే సమర్ధతను కలిగి ఉండాలి. ఏ జీవులనైనా సరే వారిలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్నటువంటి చైతన్యస్థితిని మేల్కొల్పగలిగే సమర్ధత కలిగి ఉండాలి. కేవలం సంకల్పరూపేణా ఎవరికైనా సహాయం చేయగలిగే సమర్ధత కలిగి ఉండాలి. సహజ స్వరూపమై ‘తాను బ్రహ్మమే’ అయి ఉన్నాడని ఏ సాధన లేక, ఏ తలపు లేక, ఏ ప్రమాణం లేక  తాను తానుగా ఎవరైతే ఉన్నాడో, వారే బ్రహ్మము అని అక్కడ నిర్వచించబడుతుంది. మరిట్టి బ్రహ్మమును నిర్వచించిన తర్వాత ‘మాయాతీత పరంజ్యోతిః’ ఏమండీ! బ్రహ్మమునుంచీ నీదాకా అనంత సృష్టి వచ్చిందంటున్నామే మరి ఈ బ్రహ్మమునుంచి సృష్టి రావడానికి కారణం ఏమిటి?ఇందాక వారన్నారు - ‘కార్యకారణ వివేకం’ కలిగి ఉండాలి అని. కారణము బ్రహ్మము అయితే కార్యము సృష్టి అంటున్నాం కదా! ఈ కార్యమనే సృష్టి బ్రహ్మమునుండి ఎట్లు ఉత్పన్నమాయెను? వారన్నట్లు ప్రతిబింబవత్ గా ఉత్పత్తి అయ్యిందని అందామా? రెండవది చెప్పవలసి వస్తుంది. లేదా అద్దం ఉందనన్నా చెప్పాలి. ప్రతి బింబించటానికి రెండవది ఉండాలిగా! మరి ఉన్నది బ్రహ్మమే అన్నప్పుడు ఎట్లా ప్రతిబింబిస్తాడాయన? ప్రతిబింబించే అవకాశం లేదుగా. మరి ప్రతిబింబించే అవకాశమే లేనప్పుడు సృష్టి ఎక్కడ నుంచి వచ్చింది? అంటే సృష్టిని ప్రతిపాదించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ‘బ్రహ్మసత్యం జగన్మిథ్య’ అంటే ఏమి చెప్పాలిప్పుడు? ‘జాయతే గచ్ఛతే’ అని దానికేదో మాట్లాడుతున్నావ్. జగత్ అన్నదానికి అసలక్కడ ఉన్నదా? ‘ఉన్నది బ్రహ్మమే’ అని మనం అంటున్నప్పుడు జగత్తు కసలు అక్కడ మనం ఆ ఆధార భూతమైనటువంటి సృష్టిగాని మరొక ప్రమాణం గాని మరొక ఉద్దేశ్యంగాని ఒక భోగ్యం గాని ఒక యోగ్యం గాని ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఉన్నది బ్రహ్మమే అన్న నిర్ణయమే తప్ప. ఇప్పుడు బ్రహ్మమును ఏమి చేసారయ్యా అంటే? సగుణ బ్రహ్మమని నిర్గుణ బ్రహ్మమని నిష్ప్రతియోగిక బ్రహ్మమని బ్రహ్మమునే మరలా మూడుగా విభజించి చూపెట్టారు. ఎందుకయ్యా రహస్యం అన్నాం? వేదాంతబోధ మైక్ లో చెప్పటానికి వీలులేదయ్యా! కాని చెప్పేస్తున్నాం. పాపం. మన ముందు ఉన్నటువంటి యుగాలలో ఇలా చెప్పేవాళ్ళు కాదండి. కలియుగం కదా ఇది. బుద్ధిమాంద్యం అవసులు అల్పతరాయువులు మన గురించి భాగవతములో బోల్డు చెప్పారు. కాబట్టి అలాంటి లక్షణాలున్న మనం దాన్ని అందుకోవాలి అంటే కొద్దిగా కష్టమేనని వాళ్ళే కొద్దిగా దిగి వచ్చారు. వేదవ్యాసుడే ఆ మొదటి వ్యక్తి, దిగివచ్చిన వాళ్ళల్లో. లేకపోతే అంతకు ముందు వాళ్ళు ఎవరు ఇలా చెప్పలేదు. ఆయనప్పటి నుంచి కొద్దిగా దిగివచ్చి అందరికి చెప్పండిరా బాబు! అని ఆయన మొదలు పెట్టి, మనందరికీ ఆ పరంపరను అందిచారు. మనం కూడా అదే పరంపరను కొనసాగిస్తున్నాం. నిజానికి బ్రహ్మమును ఎవరు విడగొట్టి చెప్తారు? ఇప్పటివరకు రెండుంటే విడగొట్టి చెప్పటం చాలా సులభం. కేవలం బ్రహ్మమే ఉన్నదన్న చోట విడగొట్టటం రావాలట. ఇప్పుడు దీనిని దర్శనంతో విడగొడదామా? సాధ్యం కాదే! ఎందుకనిట? ‘ఉన్నది బ్రహ్మమే’ అని చెప్పాలి అంటే, నీకు ఎన్ని వివేకాలు దాటిన వాడివై ఉండాలి? నిత్యానిత్య వస్తువివేకాన్ని దాటిన వాడివై ఉండాలి, అత్మానాత్మ వివేకాన్ని దాటిన వాడివై ఉండాలి, కార్య కారణ వివేకాన్ని దాటిన వాడివై ఉండాలి, సదసద్ వివేకాన్ని దాటిన వాడివై ఉండాలి ఎందుకంటే ఎందుకంటే సత్ బ్రహ్మము కదా! అసత్ లేదుగా ఇప్పుడు ఇహ. సత్ బ్రహ్మమును దాటిన వాడివై ఉండాలి. ఆ సత్ బ్రహ్మస్థితిలో నిలబడి ఉన్నవాడివైతే, ఇప్పుడేమి చేయొచ్చట నిన్ను? ‘ఉన్నదంతా సత్తే అయితే అసత్తుకు తావెక్కడ’? మళ్ళా కిందకి వచ్చాడు. ఒక మెట్టు కిందకి. ఉన్నదంతా సత్ బ్రహ్మమే కారణమే అయితే కార్యమెక్కడ? లేదు. ఉన్నదంతా ఆత్మే అయితే అనాత్మకు తావెక్కడ?లేదు. ఉన్నదంతా నిత్యమే అయితే, ఎందుకంటే బ్రహ్మ నిత్యంకదా! అనిత్యమునకు తావెక్కడ? లేదుగా! కాబట్టి సద్ బ్రహ్మమని నిరూపితమైనటువంటి నిర్ణయాన్ని పొందినవాడు ఎవడైతే ఉన్నాడో, అట్టివాడు మళ్ళా గురువును ఆశ్రయించాలట. ఇందాక వారన్నారు. గురు పరంపర అని. మీకెవ్వరికన్నా సందేహం వచ్చే వుండి వుండాలి. ఎలా అంటే, మామూలుగా ఇప్పుడు మీ కళ్ళకి ఎదురుగుండా కనబడుతున్నవాళ్ళు గురువులని మీరు అనుకున్నట్లైతే, వారి గురువులు సద్గురువులు. వారి గురువులు పరమ గురువులు. వారి గురువులు పరమేష్ఠి గురువులు. ఇది నాలుగు తరాలండి. అంటే ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? పరమేష్ఠిని ఆశ్రయించాలి. ఎందుకని ఇలా నాలుగుగా చెప్పారండి? ఈ బ్రహ్మమును గనుక విడగొట్టి చెప్పాలి అంటే పరమేష్ఠి అయితేనే సాధ్యం అవుతుంది. మిగిలినది ఇందాక మాట్లాడుకున్నామే అక్కడ సద్గురువులు గాని, పరమగురువులు గాని సరిపోతారు. కాని బ్రహ్మమును సగుణ బ్రహ్మమని నిర్గుణ బ్రహ్మమని నిష్ప్రతియోగిక బ్రహ్మమని బ్రహ్మమునే ‘ఉన్నది బ్రహ్మమే’ అన్నస్థితిలోనే మరలా మూడుగా విభజించి చూపెట్టగలిగే దృక్ స్థితిని కలిగించాలి ఇప్పుడు నీకు. అంటే దర్శనానికి అతీతమైనటువంటి దృశ్యానికి అతీతమైనటువంటి దృశ్య రహితమైనటువంటి రెండవదని చెప్పటానికి వీలు లేని దాంట్లో, మరలా నీకు విభజన చేసి చూపెట్ట గలిగే సమర్ధత రావాలి. ఆ సమర్ధత నీకు ఎలా వస్తుంది? నువ్వు వేరుగా ఉంటే సాధ్యం అవుతుందా? నువ్వు వేరే గురువు వేరే అంటే ఉన్నది బ్రహ్మమే అనటానికి వీలౌతుందా? వీలు కావటం లేదుగా!ఉన్నది బ్రహ్మమే అనంగానే నువ్వు ఎవరిలో కలసిపోయావ్? గురువుయందు కలసిపోయావ్. ఆ గురు శిష్య ఐక్యతాసిద్ధి వల్లనే నీకా బ్రహ్మానుభవం ప్రాప్తించింది. ప్రాపించింది అంటున్నాం అందుకని ఏమంటున్నాం? ప్రాప్తించినది అని ఎందుకంటున్నాం? అక్కడ కర్మ లేదు ఉపాసనా లేదు ఏదీ లేదు. జ్ఞాతవ్యం మంతవ్యం ఏమీ లేవు. కిందనుంచి చెప్పుకున్న శ్రవణ మనన నిధిధ్యాస ఏమీ లేవు. షడ్విధ సమాధి నిర్ణయం లేదు. నువ్వు ఎన్నన్నా చెప్పవయ్యా ! అవన్నీ లేవయ్యా! ‘ఉన్నది బ్రహ్మమే’! ఆ ఒక్క నిర్ణయమే చెప్తూ ఉండాలి నువ్వు. సహజనిర్వికల్పసమాధి లేదు. నేనుంటేనే అది ఉంది. ఎందుకని? పొందేవాడు, అనుభవిస్తున్నవాడు, త్రిపుటి అనేది ఉంటేనే అది సాధ్యపడుతుంది. లేకపోతే వీలౌతుందా? వీలుకాదు. త్రిపుటే లేదన్నప్పుడు? ఉన్నది బ్రహ్మమే, ఆ ఉన్నది బ్రహ్మమునే అనే దాంట్లో ఇప్పుడేమి చేసారు? ఇప్పుడు రెండవవాడు లేడుగా, గురువుగారు శిష్యుడుగారు లేరు. శిష్యుడుగారు గురువుగారిలో కలసిపోయారు. గురువు ఏ స్థితిలో ఉన్నాడు? ‘పరంజ్యోతిఃమాయాతీత పరంజ్యోతిః పరమేష్ఠి గురువు మాయకు అతీతుడై ఉన్నారు. ఎందుకని ‘మాయ’ శబ్దాన్ని ప్రవేశపెట్టారంటే ఇక్కడ, ‘య మా సా మా య’ అన్న సూత్రము అందరికి తెలిసిందే, ఏది లేదో అది లేదు. ఏది లేదో అంటే? ‘ఏది’ అన్నదానికి అర్థం ఏమిటి? ఇప్పుడేమి చెప్తున్నామో అది లేదండి. ఇప్పుడేమి చెప్తున్నాము? ఉన్నది బ్రహ్మము అంటున్నాము. అంతే కదా! దానిగురించేగా మాట్లాడుతున్నాం. ఏది లేదో అంటే? ఈ బ్రహ్మము ఎప్పుడు లేదో, ఏ స్థితిలో లేదో, ఏది తెలుసుకుంటే లేదో, ఏ అనుభవమైతే నీకు కలిగితే లేదో, ఏ నిర్ణయం కలిగితే లేదో, అక్కడ దాని సంగతి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు మనం సరాసరి ఇప్పుడు జీవో దేవస్సనాతనః జీవుడు దేవుడు ఒక్కటే! అని మామూలుగా కర్మ విచారణలో గాని భక్తి విచారణలో గాని యోగ విచారణలో గాని సాధనా విచారణలో గాని, త్రిపుటికి లోబడినటువంటి విచారణా స్థాయి ఇక్కడ సరిపోతుందా? చాలదు. అంటే విచారణ ఇక్కడ పనికి రాదన్నమాట! గురువు ఏ స్థితినైతే తాను స్వానుభవంగా కలిగి ఉన్నాడో వారియందు అంతర్గతమై ఉన్నటువంటి ఆ స్థితిని శిష్యుడు వారియందు ఐక్యమైపోయి ఆ స్థితిని అనుభవించాలి. తండ్రి ఎప్పటికైనా సరే, తల్లి యొక్క అనుభవాన్ని పొందగలడా? పొందలేడు. ఎందుకని? ఆయనకీ ఆ శిశువుకి జన్మ నివ్వగలిగేటటువంటి శక్తి లేదు. ఆ మాతృస్థానంలో గర్భస్థ శిశువు వల్ల ఆ మాతృదేవతకు కలిగేటటువంటి అనుభవం ఏదైతే వుందో ఆ అనుభవాన్ని ఆమెను వ్యక్తీకరించమనండి! ఏదో చెప్తుంది. ఆ ఏదో చెప్పిన దానికేమీ ప్రమాణం లేదు. ఇదని ప్రమాణం లేదు. ఎంతమందినైనా మీరు విచారణ చెయ్యండి. ఏమీ చెప్పలేని స్థితిలోకూడా ఉంటుంది. మరి చిన్న ... మాతృదేవోభవ అని మాట్లాడుకుంటున్నటువంటి ఆ గర్భస్థ శిశువు అందించేటటువంటి అనుభవమే మాటలలో వ్యక్తీకరించటానికి వీలుకాకపోతే, ‘ఉన్నది బ్రహ్మమే’ అన్నస్థితిలో మరల సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము నిష్ప్రతియోగిక బ్రహ్మము అని మూడుగా విడగొట్టి నీకు అనుభూతిగా అందించేటటువంటి పరమేష్ఠి గురువు యందు ఐక్యతాసిద్ధి, నువ్వు మాటలతో ఎలా చెప్తావ్? చెప్పటానికి వీలౌతుందా? అందుకని ఏమి చెప్పారు? బ్రహ్మమన్నదగ్గర నుంచి ఆత్మ అన్న దగ్గర నుంచి నీకు మొదట నుంచి ఈ మాట అందిస్తూ ఉంటారు, అవాంగ్మానస గోచరమని. అవాంగ్మానస గోచరం. అంటే వాక్కు మనస్సు దర్శనం – ఈ మూడింటిని దాటాలయ్యా నువ్వు. Ultimate గా నీకు ముందే చెప్పేస్తున్నాం. నువ్వేం చేసినా వాక్కు మనసు దర్శనం తోనే నీ సాధనంతా నీ ప్రయాణమంతా! నీ పరిణామమంతా! కాబట్టి వాక్కుని దాటాలి, మనస్సుని దాటాలి, దర్శనాన్ని కూడా దాటాలి. అందుకనే వాటినే ఏమి చెప్పారు మీరు- వాక్ సంయమనము మనో సంయమనము ఆత్మ సంయమనము అంటున్నారు. అర్థమైందా? కాబట్టి అనుభూతి నిర్ణయపద్ధతిగా ఎవరికైతే ఈ మూడు తెలిసినయ్యో ఇది కూడా అందులోనే ఉంది. వారు ఇందాక ఒక వాక్యాన్ని అందించారు. ఖల్విదం బ్రహ్మము. ఏ మొదటి నాల్గులో లేనిది ఈ ‘ఖల్విదం’లో ఏముంది? ఖల్వము అని ఎందుకన్నారు?ఆ ఖల్వం లోనే ఉన్నాయి ఈ మూడు. అని విడగొట్టి మళ్ళా నీకు అక్కడ చెప్తారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు అంతదూరం లోతుగా చెప్పటం లేదంటే, అది సంప్రదాయ విరుద్ధము. రెండు ఆస్థితిలో మనం ఇక్కడ మాట్లాడుకోవడం మైక్ లో సమంజసం కూడా కాదు. మనతోపాటు బయట ప్రపంచం కూడా వింటారు. మనమందరం ద్వంద్వ యుద్ధం ఇందాకనే చెప్పా...ముఖాముఖి ఆ త్రిపుటి దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్లిద్దరూ కలసి చేసే ప్రయాణం. ఇలా ఎవరికైతే ఈ నిర్ణయ వస్తునిశ్చయజ్ఞానము. ఇందాక ఒక ప్రశ్న ఇందాక వారు బోధించేటప్పుడు ఒక మాట అన్నారండి, ‘నిశ్చయజ్ఞానం’ అని నిశ్చయజ్ఞాననికి ఇక్కడ ఏమి చేస్తారంటే ‘వస్తువు’ని కలుపుతారు. ‘వస్తునిశ్చయజ్ఞానము’ అంటారు. వస్తువు అంటే ఏమిటయ్యా? ‘ఉన్నది బ్రహ్మమే’ అనునది వస్తువు. నిశ్చయజ్ఞానమనగా ఆ ఉన్నది బ్రహ్మమ్మన్న వస్తువులో సగుణ నిర్గుణ నిష్ప్రతియోగిక భేదం ఏదైతే ఉందో, అది వస్తునిశ్చయజ్ఞానం. ఈ మూడింటి యొక్క సమాహారం ‘మాయ’. నువ్వేదో త్రిపుటి దాటేశావ్, త్రిపుటి దాటేశావ్ అని ఇందాకడి నుంచి చెప్పుకోస్తున్నావ్ అది కాదయ్యా ! Original త్రిపుటి ఇది. ఇది త్రిపుటి కూడా కాదయ్యా ద్విపుటే. ఎందుకని? ఇద్దరమే ఉన్నా౦గా ఇప్పడు. గురుశిష్యులు ఐక్యత చెందినప్పటికీ లేశ మాత్ర భేదం చేత నాలోపలి నుండి నువ్వు ఆ స్థితిని గ్రహిస్తున్నావ్ గా ! గ్రహిస్తున్నప్పుడు నువ్వు నేనుగా లేశ మాత్ర భేదం చేత ఉండకపోతే నువ్వు గ్రహించగలవా? నది వెళ్లి సముద్రంలో పూర్తిగా కలసిపోయిందండి, అప్పుడు నది లక్షణాలను గుర్తించటానికి వీలౌతుందా? కలిసే స్థానంలో సంగమ స్థానంలో మాత్రం గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు ఆస్థితిలో ఉన్నారు. అలా ఎప్పుడైతే నీవు గ్రహించావో, ఇప్పుడేమన్నారు? మాయాతీత పరంజ్యోతిః దృక్ స్థితి కూడా ఏ దృక్ స్థితి వల్లైతే ఈ మూడు నిరూపితం అవుతున్నాయో, ఆ దృక్ కి ‘సర్వదృక్’ అని పేరు. ఆ దృక్ కి ఏమని పేరు? ‘సర్వదృక్’. ఎందుకని ఉన్నది బ్రహ్మమే అన్నచోట సర్వము వచ్చేసింది అక్కడ! ఈ సర్వముని గమనించేటటువంటి దృక్ అంటే గమనించుట, సర్వదృక్ మాయ అతీతం అన్నాం కదా! వెంటనే అక్కడ. అతీతం అంటే అర్థం ఇందాక ఏమి చెప్పాము? అంతకు ముందు ఏది ఉందో, అతీత స్థితిలో అది లేదు అని అర్థం.  ఏదైతే ముందు నిరూపించ బడుతున్నావో అలా లేవని అర్థం. ఇప్పుడు ఎవరు ఎవరిని పోగొట్టుకున్నారు? నన్ను నేను తెలుసుకున్నాను, నన్ను నేను పోగొట్టుకున్నాను. తానెవరో తెలుసుకున్నాడు, తన్ను తానెవరో పోగొట్టుకున్నాడు. తన్ను తాను పోగొట్టుకోవటానికి సిద్ధ పడ్డ వాడెవడో వాడు దృక్ రహితుడు. మాయకి అతీతుడు. అక్కడ అయ్యింది మాయకు అతీతం. తాను మిగిలి ఉన్నంత వరకు తానంటే ఇప్పుడు ఎవరు అక్కడ సర్వ కాల సర్వావస్థలలో సర్వత్రా సర్వే ఉన్నటువంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది తాను. ఇందాక ఒక వాక్యమన్నారు . అయమాత్మా బ్రహ్మము. అరె! రెండు ఒక్కచోటే వేశాము అక్కడ. ఆత్మ – బ్రహ్మ అనే శబ్దాలు. ఎందుకనిట?  ముందు ‘త్వం’ని  తెలుసుకోమన్నారుగా అక్కడ. ‘త్వం’ అంటే ఎవరు ఇప్పుడు ‘ఆత్మ’. ‘తత్’ అంటే ఎవరు ‘బ్రహ్మ’. ఆ రెండు శబ్దాలని అయం శబ్దంతో కలిపేస్తున్నాడు అన్నమాట. కలిపినప్పుడు ఏమైపోయింది? ఈ ఆత్మ శబ్దం పోయింది ఇక. ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయం నీకు కలిగింప చేసారు అక్కడ. కలిగింప చేసి ఏమి చేశారు మళ్ళా? ఆ బ్రహ్మమును విడగొట్టి చూపెట్టి ఈ బ్రహ్మము కూడా దీనికంటే ముందున్న స్థితిలో లేదయ్యా! అప్పుడు సృష్టి క్రమశః విచారణలో బ్రాహ్మణోరవ్యక్తః బదులు ‘ బ్రహ్మణః అవ్యక్తః ‘ రెండు విడిపోయినాయి. బ్రహ్మము వేరు, అవ్యక్తము నుంచి క్రిందకున్నదంతా వేరు. ఈ ఇట్లా విడిగా బోధించే టటువంటి ఈ ఆఖరి దైనటువంటి తనను తాను పోగొట్టుకోవటం అనేటటువంటి విధానమేదైతే ఉన్నదో, ఇదే ఆఖరి బోధ. ఇక దీని తర్వాత బోధల్లేవండి. ఈ తనను తాను పోగొట్టుకోవట మనేటు వంటి స్థితి వల్ల ఆ పరిపూర్ణ స్థితిని పొందుతారు. అంటే తనను తాను పొగొట్టు కున్నప్పుడు ఏమయ్యాడు? ఇందాక వారు చెప్పారు. శూన్యం తెలిసింది సర్వం కూడా తెలిసింది. శూన్యం సర్వములు ఒక్కటే అనికూడా తెలిసింది ఇప్పుడు. ఎందువల్ల సర్వ దృక్ అయ్యాడుగా! శూన్యం నుంచా సర్వం వస్తుంది. మళ్ళా సర్వం శూన్యం అవుతుంది. తానో ఉన్నాడా లేడా? ఉన్నాడని అంటేనేమో దృక్ గా మిగిలిపోయి ఉన్నాడు. లేడన్నప్పుడు ఏమయ్యాడు? దృక్ రహితమై పోయాడు. దృక్ రహితమైపోతే ఉన్నది ఏమిటి? మళ్ళా అదేగా ప్రశ్న? ఈ ప్రశ్న ఎక్కడ మొదలు పెట్టాం? తత్వమసి మహావాక్యం దగ్గర కూడా అదే అడుగుతున్నాం. ఇక్కడ కూడా అదే అడుగుతున్నాం ఉన్నది ఏమిటి? ఇప్పుడు ఈ చివర ఏమి చెప్పగలడండి? తాను లేనివాడు ఏమన్నా చెప్పగలడా? ఏమన్నా బోధ ఉన్నదా? ఏమైనా సిద్ధాంతం ఉన్నదా? ఏదైనా సాధన ఉన్నదా? ఏమైనా విచారణ ఉన్నదా? ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అక్కడ? ఏమన్నా సూచనలు ఉన్నాయా? మరి దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్య అంటే అర్థము ఏమిటి? దృక్ రహిత పద్ధతి. తాను లేని స్థితి. ఆయన ఏమన్నా కదిలాడా? కదలలేదు. ఏమి చెప్పలేదా? అంతా చెప్పేసాడు. అంతేనా కాదా? కాబట్టి విశేషమైనటు వంటి దానిని తాను కదలకనే తాను పరిణమించకనే తాను మార్పు చెందకనే తాను లేకుండగనే, ఏ స్థితినైతే సూచిస్తున్నాడో, ఆ సూచన పేరేమి పెట్టాం? ‘మౌనవ్యాఖ్య’ అన్నాము. అంటే ఆయనేమీ కదలలేదు. పరిణామం చెందలేదు. కదలని దానిని సూచించాడు. దృక్ అన్నాకూడా ఎదో ఒక కదలిక ఉంది. ఉండబట్టేగా మిగిలినది అంతా వచ్చింది. అనేక కల్పములు అందులోనుంచే ఉత్పన్నమౌతున్నాయి. అనేక మహాయుగములు అందులోనుంచే ఉత్పన్నం అవుతున్నాయి. అనంతమైన విశ్వం అంతా అందులోనుంచే ఉత్పన్నం అవుతుంది. మరి ఏ కదలిక లేనటువంటి అనంత విశ్వంలో ఉన్నటువంటి అంతరిక్షం. ఉందా లేదా? అంతరిక్షంలో విశ్వం ఎంత?  ఒక లవలేశం. మిగిలిన అంతరిక్షం ?అది ఎప్పుడూ ఉంది. కొద్దిపాటి కదలికలతో కదులుతున్న విశ్వాన్ని మాత్రమే మనం గమనించి అనంతంగా ఉన్న అంతరిక్షాన్ని వదిలివేస్తే అప్పుడేమంటున్నా౦? దృశ్య పద్ధతిగా మాత్రమే విచారణ చేశాము ఇప్పటి వరకు. కాబట్టి సర్వదృక్ రహితపద్ధతిని గనుక ఆశ్రయిస్తే వారన్నారు ఇందాక మీకు మూడు కానుకలు వచ్చినాయి అని  ఏమిటది?మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం. కాబట్టి మనుష్యత్వం అంటారా, అది మీ పుణ్యవశాత్తు మీకు వచ్చేసింది already. ముముక్షత్వం అంటారా ? ముముక్షత్వం అంటే ఏమిటి ఇప్పడు? ఈ పరంజ్యోతి అనేటువంటి స్థితి. ‘మాయాతీత పరంజ్యోతిః’ అనేటటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో, దానినే తెలుగులో చెప్పాల్సి వచ్చినప్పుడు అంటే అది సంస్కృత పద్ధతి. తెలుగులో చెప్పాల్సి వస్తే ‘బయలు’ అన్నారు. మాయని ‘ఎఱుక’ అన్నారు. మామూలు మాటల్లో అందరికీ అర్థం అవ్వటం కోసం. కాబట్టి ఎఱుక లేనిది అన్న పద్ధతిలో ఉన్నది బయలే. చెప్పేవాడు లేడు. తెలుసుకునే వాడు లేడు. వివరించేవాడు లేడు. అనుభవించే వాడు లేడు. నిర్ణయించే వాడు లేడు. అన్నీ లేడు లేడు లేడు లేడు లేడు అని నిరసించుకున్నాడు. ఎక్కడి నుంచి?  ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నిరసించేస్తే ఏమయి పొయ్యింది? శూన్య సర్వములు నిరసించబడిపోయినవి. శూన్యము నిరసించబడి పోయినది, సర్వమూ కూడా నిరసించబడిపోయినది. ఇప్పుడు సర్వాదిష్టానం అసలు ఎవరు? ఒకటి ఉండాలా వద్దా? ఈ శూన్య సర్వములూ కూడా ఏదైనా ఒక అధిష్టానానికి లోబడే ఉండాలా? ఉండక్కర్లేదా? అది ఎవరయ్యా అంటే అనేక మహాయుగములు ఉత్పన్నమౌతున్నటు వంటి కాలమే. భగవంతుండు కూడా తన గురించి తాను ఏమి చెప్పుకున్నాడు? కాలస్వరూపుడని చెప్పుకున్నాడు. అంటే మిగిలిన రెండు ప్రమాణములు లేవక్కడ. దేశము కాలము మానము అంటున్నాం కదా! కాల ప్రమాణము మీద మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్న త్రిపుటిలో ఉన్న కాలంలో మాట్లాడుకోవటం లేదు. ఏ కాలంలో అయితే భగవద్ అవతారములు ఉత్పన్నం అవుతున్నాయో, దశావతారములు ఉత్పన్నమైనాయో, మహాయుగములు ఉత్పన్నమయినాయో, ఏ కాలంలో అయితే అనంత విశ్వం ఉత్పన్నం అవుతుందో ఆ మహాకాలం గురుంచి మాట్లాడుతున్నాం. అందుకే మహాకాళేశ్వర్ అను ఒక క్షేత్రాన్ని కూడా ఉంది. మనం మామూలుగా భూత భవిష్యత్ వర్తమానములు అనుకుంటాం అని వాళ్ళేమి చేశారంటే ఎక్కడికక్కడ ఒక నిదర్శనాన్ని పెట్టారు. అలాగే ఈశ్వర స్థితి, శివ స్థితి, బ్రహ్మ స్థితి ఇవన్నీకూడా ఒక స్థితి కి వెళ్ళేటప్పటికి లేనివి అవుతాయని నిరూపించటం కోసమనే ‘అమరనాథ్’ పెట్టారు. ఒక కాలంలో అమరేశ్వరుడుంటాడు, ఒక కాలంలో ఉండడు. అదేంటయ్యా ! ఈశ్వరుడు ఎప్పుడూ ఉంటాడుగా? మరి నీ తెలివితేటలు అక్కడి వరకే ఉంటె అక్కడి వరకే నేర్చుకో... అంతకంటే ఎదగాలి అంటే ఇందాక చెప్పాం గురు పరంపర క్రమేపీ నువ్వు ఎదిగే కొద్దీ సద్గురువుని పరమ గురువుని పరమేష్ఠి గురువుని ఆశ్రయించ గలిగేటటువంటి అశరీర పద్ధతిని, ఇది అశరీరపద్ధతండి. ఎందుకనీ? సశరీర గురువునైతే కాళ్ళ మీద పడో వేళ్ళమీద పడో బ్రతిమలాడో బామాడో పోద్దినో రాతిరో అర్ధరాత్రో ఏదో ఒక సమయంలో ఆయన నుంచి బోధ నేర్చుకునే అవకాశం ఉన్నది. సద్గురువు దగ్గర నుంచి పరమేష్ఠి గురువు వరకు అశరీర పద్ధతి. కాబట్టి అర్థమైందా అండి?ఈ అశరీర పద్ధతిగా వచ్చినటు వంటి శిష్యుడు ఎవడైతే సచ్చిష్యుడు ఉన్నాడో, ఇందాక వారన్నారు percentage లన్నీ తీసేస్తూ తీసేస్తూ తీసేస్తూ చివరికి ఒక్క percent ని మిగిల్చింది ఆవిడ. ఆ ఒక్క percent ఎవడయ్యా అంటే? ఈ  అశరీర పద్ధతిని ఆశ్రయించేటటువంటి సచ్చిష్యులెవరో వాళ్ళు ఆ ఒక్క percent. వాళ్ళు తప్పక కడతేరే అవకాశం ఈ జన్మలోనే ఉన్నదని పరమేష్ఠి గురువులయొక్క ఆశీర్వచనం. వారి ఆశీర్వచనాలను అందుకొని అందరమూ మోక్షమార్గంలో పరిణతి చెంది కడకు గమ్యాన్ని చేరే అవకాశాన్ని అంది పుచ్చుకుందామని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పరమేష్ఠి గురువులకు మీకు ధన్యవాదాలు.